ఖంజర్   Leave a comment

HIGHWAY

ఓ బైక్ రోడ్డుపై సర్రున దూసుకుపోతోంది.  వెనుకనున్న ప్రియురాలు భయంతో కావలించుకుని కూర్చుండటంతో అతను మరీ రెచ్చిపోయి డ్రైవ్ చేస్తున్నాడు.  సడెన్ గా ఓ కారు దగ్గరనుంచి వెళ్ళడంతో ఆమె  “STOP” అంటూ బిగ్గరగా అరిచింది.  అతను బైక్ ఆపేశాడు.  ఆమె బైక్ దిగి కొంచెం దూరంగా చెట్లలోనికి వెళ్ళి భయంతో కూలబడింది.

బైక్ స్టాండ్ వేసి “sorry sorry” అంటూ బతిమాలుతూ ఆమె దగ్గరికి వెళ్ళాడు.

“అసలు నువ్వేం చేస్తున్నావో నీకర్థమౌతోందా?” ఆమె కోప్పడుతూనే ఉంది.

ఆమెను శాంతపరచటానికి “కోపంలో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా!” అంటూ సెల్ ఫోన్ తీసి ఆమె ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్నాడు.

అంత టెన్షన్ లోనూ ఫోటో అనేసరికి ఆమె కురులను సవరించుకుంటోంది.  అమె చేష్టలకు నవ్వుకుంటూ సెల్ కెమెరాలోకి చూస్తున్న అతని దృష్టిని ఏదో ఆకర్షించింది.

ఫోటో తీయకుండా తనవైపే వస్తున్న అతన్ని చూసి అర్థం కాక “ఏంటి?” అని అడిగింది.

ఆమె వెనుకనే ఓ వ్యక్తి కొద్ది దూరంలో ఒళ్ళంతా మట్టికొట్టుకు పోయి తలంతా రక్తంతో బోర్లా పడి ఉన్నాడు.

అతను దగ్గరగా వెళ్ళి పడున్న వ్యక్తి (సుధీర్) ని వెల్లకిలా తిప్పుతుంటే ఆమె “వద్దు వద్దు” అంటూ కంగారుపడుతోంది.

అతను సుధీర్ ముక్కు దగ్గర వేలు పెట్టి శ్వాస పరీక్షించాడు.  “బతికే ఉన్నాడు” ఎవరైనా సహాయం చేస్తారేమో అన్నట్లుగా రోడ్డుకేసి చూశాడు.  అంతా నిర్మానుష్యం.

“108 కి ఫోన్ చేద్దాం” సలహా ఇచ్చిందామె.  ఫోన్లో వివరాలన్నీ చెప్పి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడతను.

కొద్ది సేపటికి 108 వ్యాన్, పోలీస్ జీపు వచ్చాయి.  సుధీర్ ను తీసికెళ్ళిపోయారు.

***

MECHANIC  SHED

Crime branch ACP విశ్వనాథ్ జీప్ వచ్చి ఆగింది.  మెకానిక్ బయటికొచ్చి నమస్తే చెప్పి బాయ్ నెట్ పైకి లేపి రిపేరు చెయ్యసాగాడు.  విశ్వనాథ్ అతని పక్కనే నిలబడి సిగరెట్ వెలిగించాడు.

“Hyderabad వచ్చాడు సార్”

“ఎన్నాళ్ళైంది?”

“ఎన్నాళ్ళో సరిగ్గా తెలియదు సార్.  ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు.”

“Information పక్కాయేనా?”

“పక్కా సార్.  ఏం డౌట్ లేదు.”

“ఏ ఏరియాలో ఉన్నాడు?”

“ఆ వివరాలింకా తెలియదు.”

“సరే ఓ కన్నేసి ఉంచు.  ఏ చిన్న information తెలిసినా కబురు చెయ్.”

“అలాగే సార్.”

సిగరెట్ కింద పడేసి పర్సులోంచి రెండు 500 రూపాయల నోట్లు తీసి మెకానిక్ కు ఇచ్చాడు.  అతను తీసుకొని వెళ్ళిపోయాడు.

***

HOSPITAL ROOM

సుధీర్ మగతగా కదలసాగాడు.  డ్యూటీ నర్స్ “డాక్టర్” అంటూ పిలవడానికి వెళ్ళింది.  ఆమె డాక్టరుతో తిరిగి వచ్చేసరికి సుధీర్ కళ్ళు తెరిచాడు.  గాయాల తాలూకు బాధ వల్ల కదలలేకపోయాడు.  డాక్టర్ని చూసి లేవబోతుంటే వద్దని వారించి పల్స్ చెక్ చేయసాగాడు డాక్టర్.

“నాకేమైంది?”

“మీకు యాక్సిడెంట్ అయింది.  మీ పేరు?”

“సుధీర్.”

“Pains తగ్గడానికి కొంత టైం పడుతుంది.  అంతకు మించి మీకేం కాలేదు.  రిలాక్స్.”

Pulse, BP చెక్ చేసిన తర్వాత ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా

“డాక్టర్ ఇది 2005 వ సంవత్సరం కదా!  అదేంటి 2010 క్యాలండర్ ఉంది?” గోడ మీద క్యాలండర్ ను చూపిస్తూ అడిగాడు సుధీర్.

“What” అంటూ ఒక్క క్షణం ఆగిన డాక్టరుకు ఏదో స్ఫురించింది.  “Oh! my God.”

***

దుర్గ అడ్డా:

అనుచరులతో అంతా కోలాహలంగా ఉంది.  ఓ నడివయసు వ్యక్తి లోనికొస్తుంటే అంతా విష్ చేస్తున్నారు.  అతను దుర్గ గదిలోకి ప్రవేశించాడు.  జేబులోచి సుధీర్  ఫోటో తీసి టేబుల్ పై పడేశాడు.

“ఏంటి పని బాబాయ్?”

“వెతికి పట్టుకోవాలి.”

“ఎలా తప్పిపోయాడు?”

“నిన్న పొద్దున్నే స్కూలు కెళ్ళాడు.  ఇంతవరకూ రాలేదు.”

దుర్గకు నవ్వు రాలేదు.

“ఎవరి తాలూకు?”

“No comments.”

“ఏ ఏరియాలో తప్పిపోయాడు?”

“No comments.”

“ఏమీ చెప్పకుండా పట్టుకోమంటే ఎలా?”

బాబాయ్ ఓ చెక్ తీసి ఇచ్చాడు.

“ఇది blank check… ” దుర్గ మాటలు మధ్యలోనే ఆగిపోయాయి.

“కాక పోతే ఒక్క విషయం.  పోలీసులు ఇతన్ని పట్టుకోకముందే నువ్వు ఇతన్ని పట్టుకోవాలి.  Any comments?”

“No comments.”  దుర్గ అన్ని ప్రశ్నలకు సమాధానం అతని చేతుల్లోనే ఉంది.

***

HOSPITAL-DOCTOR’S ROOM

డాక్టర్ సుధీర్ రిపోర్ట్స్ చూస్తున్నాడు.

“తల మీద అంత బలమైన దెబ్బలు ఏమీ తగల్లేదు.  మీ బ్రెయిన్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ గానే ఉన్నాయి.  జనరల్ గా యాక్సిడెంట్ తాలూకు షాక్ వల్ల కొంతమంది తామెవరో కూడా మర్చిపోతుంటారు.  అదీ టెంపరరీ గానే.  కొన్నాళ్ళకు మామూలైపోతుంటారు.  కాని మీ కేసు చిత్రంగా ఉంది.  పర్టిక్యులర్ గా గత 5 సంవత్సరాలు మాత్రమే మర్చిపోయారు.  మీ ఫ్యామిలీ గురించి చెప్పండి.”

“అమ్మా నాన్నా నా చిన్నతనంలోనే పోయారు.  మా బామ్మే నన్ను పెంచి పెద్దవాడిని చేసింది.  ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది మా బామ్మ ఒక్కత్తే.  PG కోసం హైదరాబాద్ వచ్చాను.  ఐదు సంవత్సరాలంటే నాకు తెలిసిన వాళ్ళూ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో ఏంటో !

“ఈ మెడిసిన్స్ వాడండి.  ఓ వారం రోజుల్లో బాడీ పెయిన్స్ తగ్గి పోతాయి.  అప్పటికీ ఏమీ గుర్తుకు రాకపోతే ఎవరైనా specialist కి చూపించండి.”

***

పాండు అడ్డా:

“అన్నా”

“ఏంట్రా”

“అది…అది…”

“చెప్పరా”

“నువ్వు కోప్పడనంటే”

“సర్లే చెప్పు”

“శాంతిలాల్ సేఠ్ కి ఓ ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి.”

“వాడు దుర్గ గాడి కస్టమర్ కదరా!  మన దగ్గరకెందుకొచ్చాడు?”

“దుర్గ మిగతా దందాలన్నీ బంద్ చేసి ఎవరి గురించో వెతుకుతున్నాడంటన్నా.  సేఠ్ కేమో మంచి బేరం వచ్చింది.  ఇంట్లో ఉన్న పార్టీ ఖాళీ చెయ్యమంటున్నారు.  అందుకని…”

“ఎంతిస్తానంటున్నాడు?”

“యాభై”

“రెగ్యులర్ కస్టమర్ని కాదని, యాభై లక్షలు కూడా వద్దనుకుని ఒక్కడి గురించి వెతుకుతున్నాడంటే…ఏదో పెద్ద చేపే పడిందిరా వాడికి.  నా దందా మొత్తం నాశనం చేశాడు.  వాణ్ణి అంత తేలిగ్గా వదలను.  మన వాళ్ళనందరినీ రమ్మని చెప్పు.  ఆ దుర్గ గాడి మనుషుల్ని ప్రతివాణ్ణి ఫాలో అవమని చెప్పు.  వాడెవరో దొరగ్గానే ఎత్తుకొచ్చేయండి.  వదలొద్దు.  ఏం జరిగినా సరే.”

“అన్నా మరి సేఠ్ సంగతి?”

“నేను చూసుకుంటాలే వెళ్ళు.”

***

ఓ పల్లెటూరు:

RTC బస్సు వచ్చి ఆగింది. సుధీర్ దిగి తన ఇంటికి వెళ్ళాడు.  ఇంటి అరుగు మీద ఓ ముసలావిడ కూర్చొని ఉంది.  సుధీర్ ని చూడగానే లేచి దగ్గరకు వచ్చింది.

“వచ్చావా అయ్యా !  నాకు తెలుసయ్యా ఎక్కడున్నా ఇయ్యాల నువ్వొస్తావని.  నీ కోసం ఎంత ఎతికించామనుకున్నావు.  మీ పెద్దయ్య వాళ్ళందరూ ఇప్పటిదాకా నీ కోసం చూసి చూసి ఇప్పుడే చెరువు దగ్గరికి వెళ్ళారు.   తొందరగా ఎల్లయ్యా ఎల్లు.”

***

చెరువు గట్టు:

పురోహితుడు పిండప్రదాన ఏర్పాట్లు చేస్తున్నాడు.  మగవాళ్ళు స్నానాలు చేస్తున్నారు.  కొంచెం దూరంగా కొందరు ఆడవాళ్ళు జరిగేది చూస్తున్నారు.

అక్కడకు వచ్చిన సుధీర్ బామ్మ ఫొటో కు దండ వేసి ఉండటంతో స్థాణువులా నిలబడిపోయాడు.  బామ్మ చనిపోయిందని అర్థమై ఒక్కసారిగా దుఖం తన్నుకువచ్చి కుప్పకూలిపోయి రోదించసాగాడు.  ఆడవాళ్ళు   దగ్గరకొచ్చి ఓదార్చసాగారు.

“తల్లీ తండ్రీ పోయినా బిడ్డను కడుపులో పెట్టుకుని కాపాడుకుంది.”

“నిన్నో ఇంటివాణ్ణి చేసే దాకా తీసికెళ్ళొద్దని దేవుణ్ణి కోరుకునేది.  ఆ కోరిక తీరకుండానే తీసికెళ్ళిపోయాడు.”

“అయ్యా సంవత్సరీకం ఏర్పాట్లు పూర్తయ్యాయి.  పిండ ప్రదానం చెయ్యాల్సిన వారసుడు స్నానం చేసి రావాలి” పురోహితుడు కేక వేశాడు.

బామ్మ పోయి సంవత్సరం అవుతుందన్న ఆలోచన షాక్ లాగా తగిలింది సుధీర్ కు.  కొందరు మగవాళ్ళు వచ్చి సుధీర్ ను చెరువులో దించి స్నానం చేయించి పంచె కట్టారు.  సుధీర్ కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.

ఖర్మకాండ జరుగుతున్నంతసేపూ బామ్మ స్మృతులు సుధీర్ ను వెంటాడుతూనే ఉన్నాయి.  పిండాలు వదులుతున్నప్పుడు చిన్నప్పుడు బామ్మ తనకు గోరుముద్దలు తినిపించడం గుర్తొచ్చి విలవిలలాడిపోయాడు.

***

HYDERABAD–SHOPPING COMPLEX

సుధీర్ పరిసరాలు చూసుకుంటూ ఓ షాపు దగ్గరికొచ్చాడు.  “ఈ దగ్గర్లో బ్యాచులర్స్ కి రూంస్ రెంట్ కిచ్చే ఇల్లొకటుండాలి” షాపతన్ని అడిగాడు.

“ఆ ఇల్లు ఇదే.  పడగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి కూడా చాలా కాలమైంది.”

“ఇంటి ఓనర్ ఎక్కడున్నాడో మీకేమైనా తెలుసా?”

“పిల్లల దగ్గరకి ఫారిన్ వెళ్ళిపోయాడు.”

చేసేదేమీ లేక బయటికొచ్చాడు సుధీర్.  ఎటు వెళ్ళాలో అర్థం కాక పక్కనే ఉన్న ATM center మెట్లపై కూలబడ్డాడు.  ఏదో గుర్తొచ్చిన వాడిలా పర్సులోంచి ATM card తీసి లోని కెళ్ళి balance చెక్ చేశాడు.  సుధీర్ కళ్ళు బైర్లు కమ్మాయి.  కోటిన్నర రూపాయలు.  అయోమయంగా బయటికొచ్చి నడవసాగాడు.

సుధీర్ ను చూసిన దుర్గ మనిషొకడు సెల్ ఫోన్ తీసి మాట్లాడాడు.  మరుక్షణం పదిమంది దుర్గ మనుషులతో జీప్ వచ్చి ఆగింది.  తనని బలవంతంగా జీపులోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తుండంతో సుధీర్ తిరగబడ్డాడు.  వాళ్ళను ఎదుర్కొంటుండగా పాండు మనుషులు వచ్చేశారు.  దుర్గ మనుషులపై కాల్పులు జరుపుతూ సుధీర్ ను తమతో తీసికెళ్ళాలని లాక్కొస్తున్నారు.

తప్పించుకొనే ఆరాటంలో ఎవరు ఎవరో అర్థం కాకపోయినా దొరికినవాళ్ళను దొరికినట్లు కొడుతూనే ఉన్నాడు సుధీర్.  దుర్గ మనుషులు కూడా గన్స్ తీశారు.  ఈ పెనుగులాటలో సుధీర్ చేతికి గన్ దొరికింది.  సేఫ్టీ లాక్ ఓపెన్ చేసి తనమీదకొస్తున్న ప్రతివాణ్ణి గురి చూసి కాళ్ళకేసి కాల్చసాగాడు.

పోలీస్ సైరన్ వినిపించడంతో అందరూ మాయమైపోయారు.  చేతిలో గన్ తో సుధీర్ ఒక్కడే నిలబడిపోయాడు.  ఒక్క క్షణానికి సుధీర్ కు అర్థమైంది తనకు గన్ వాడటం వచ్చు అని.  తన చేతిలోని గన్ ను చూడగానే ఒళ్ళు జలదరించి దాన్ని దూరంగా విసిరేసి తను కూడా పరుగు లంకిచుకున్నాడు.

***

POLICE CONFERENCE ROOM

DGP:

“ఖంజర్…నేరసామ్రాజ్యం మన department కు విసిరిన సవాల్.  Most wanted professional killer in India…. Bollywood music director, UP Ex CM, Ambala Group Chairman….అన్నీ costly murders…. ఎక్కడుంటాడో తెలియదు.  ఎలా ఉంటాడో తెలియదు.  Intelligence reports ప్రకారం ఖంజర్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడు.  అతని టార్గెట్ ఎవరు?….Mr. Viswanath…”

“Sir”

“ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఖంజర్ తప్పించుకోకూడదు.”

“Yes sir”

“One more thing.  He is Mr. Krishnakanth.  గత సంవత్సరకాలంగా ఖంజర్ ను వెంటాడుతున్నారు.  He is the expert on Khanjar.  మీతో పాటే work చేస్తారు.  Mr. KK”

“Sir”

“This time, I want results.”

“Sure sir.”

***

RESTAURANT

కాఫీ తాగుతున్న సుధీర్ చూపులు కొంత దూరంలో కూర్చున్న ఓ వ్యక్తి చూపులతో కలుసుకున్నాయి.  తనని చూసి అతను నవ్వుతున్నాడు.  అతనికి తాను తెలిసుంటానేమో అన్న ఆశతో అతని దగ్గరికి వెళ్ళాడు.

“నేను మీకు తెలుసా?”

“ఇవాల్టికి తెలియదు.  బహుశా రేపటికి తెలియొచ్చు.”

“అర్థం కాలా”

“Hi I am alternate gajini.  ఇవాళ జరిగింది రేపు గుర్తుండదు.  కాని ఎల్లుండికి గుర్తొస్తుంది.  మీరు…”

“I am longterm gajini.  ఐదు సంవత్సరాలు మాయమైపోయాయ్.”

“ఆఫర్ భలే ఉంది. దొరికిన కాడికి అప్పులు చేసి తరువాత నాకేం తెలియదు అనొచ్చు.”

“దీంట్లొ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది.  ఎవడొచ్చి నువ్వు నాకు బాకీ అని చెప్పినా చచ్చినట్లు కట్టాలి.”

నిజమే.  మెమరీ లేకపోతే ఎవడేం చెప్పినా నమ్మాలి.”

బయటకు రాగానే సుధీర్ కు ఓ బిచ్చగత్తె అడ్డుపడింది.  చిల్లర కోసం తడుముకుని లేకపోవడంతో పర్సు తీశాడు.  అందులో పాత రూపాయి, రెండు రూపాయల నోట్లు కనబడడంతో అవి తీసి ఇచ్చాడు.

“ఈ నోట్లు చెల్లవు బాబూ” తిరిగిచ్చేసింది.

ఓ పది రూపాయల నోటు ఆమెకిచ్చి పంపేశాడు.  పాత నోట్లను చూస్తున్న సుధీర్ కు ప్రతినోటు మీద ఏదో రాసుండటం కనిపించింది.  అది ఓ వెహికిల్ నంబరు.  ప్రతినోటు మీద అదే నంబరు.  పైగా అది తన చేతిరాత.  తనే రాసుకున్నాడు.

***

RTO office లోంచి బయటికొచ్చి ఆటో ఎక్కాడు సుధీర్.  ఓ వీధి చివర్లో ఆటో ఆగింది.  తన చేతిలోని పేపర్లో ఉన్న అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు.  చివరికి దొరికింది.  ఆ ఇంటి ముందు ఓ స్కూటీ పార్క్ చేసి ఉంది.  పర్స్ తీసి పాత నోట్లు చెక్ చేశాడు.  అదే నంబరు.

ఇంట్లోకి వెళ్ళాలా వద్దా అని ఒక్క క్షణం తటపటాయించాడు.  గేటు తీసుకుని ఓ అమ్మాయి వచ్చి స్కూటీ స్టార్ట్ చేసి బయలుదేరింది.  ఆటోలో ఆమెను ఫాలో అవసాగాడు సుధీర్.

అద్దంలోకి చూసిన సౌమ్య కు ఆటోలోంచి మాటి మాటికి తల బయటకు పెట్టి చూస్తున్న సుధీర్ కనిపించాడు.  కొద్దిగా నవ్వుకుంది.  తను ఆఫీస్ దగ్గర ఆగగానే అతను ఆటో దిగి తననే గమనించడం చూసింది.  చటుక్కున వెనక్కుతిరిగేసరికి అతను చూపు తిప్పుకున్నాడు.  నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.  లోనికి వెళ్ళాలా వద్దా, వెళ్ళి ఏం మాట్లాడాలి అన్న మీమాంసలో వెళ్తున్న ఆమెను చూస్తూ ఉండిపోయాడు.

పక్కకు తిరిగిన సుధీర్ కు కాస్త దూరంలో ఇద్దరు వ్యక్తులు కనిపించారు.  తనను కిడ్నాప్ చెయ్యాలని చూసిన దుర్గ మనుషులు వాళ్ళు.  సుధీర్ ను చూడగానే పరుగు లంకిచుకున్నారు.  వాళ్ళలో ఒకడిని వెంబడించి పట్టుకున్నాడు.

“ఎవడ్రా మిమ్మల్ని పంపించింది?”

“దుర్గ”

“ఏంట్రా వాడికి నాకు శతృత్వం? “

“నాకవేం తెలియవన్నా.  నన్ను వదిలేయన్నా”

“ఆ దుర్గ ఎక్కడుంటాడో చూపించు పద.”

***

దుర్గ అడ్డా:

“పాండు గాడి ముఠా అక్కడికెలా వచ్చిందిరా?”

“ఏమోనన్నా”

“అసలు గన్స్ ఎందుకు తీశార్రా?”

“ముందు వాళ్ళే ఫైరింగ్ మొదలు పెట్టారన్నా”

“సరే సరే త్వరగా అడ్డా మార్చేయాలి.”

ఇంతలో బయట విశ్వనాథ్ జీప్ వచ్చి ఆగింది.

“అన్నా ACP విశ్వనాథ్” పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పాడొకడు.

“రేయ్ !  అందరూ వెనక నుంచి వెళ్ళిపోండి.  ఒక్కడూ దొరక్కూడదు.”

విశ్వనాథ్ లోనికొచ్చేసరికి అంతా ఖాళీ.

సుధీర్ ను తీసుకొస్తున్న గూండా పోలీసు జీపుని చూసి బైక్ ఆపేశాడు.  దుర్గ అడ్డాను చూపించి తుర్రుమన్నాడు.

విశ్వనాథ్ బయటికొచ్చి జీపులో వెళ్ళిపోయాడు.

సుధీర్ లోనికి ప్రవేశించాడు.  ఎవరూ లేరు.

***

MUMBAI

భాయ్ అసహనంతో ఊగిపోతున్నాడు.  “దుర్గ విశ్వనాథ్ కి దొరికాడంటే మన ప్లాన్ మొత్తం పాడవుతుంది.  వాణ్ణి అర్జంటుగా హైదరాబాద్ వదిలి పొమ్మని చెప్పండి.  ఈ సిచ్యుయేషన్ లో ఎవరిని నమ్మాలో అర్థంకావడం లేదు..”

సోఫీ లోనికొస్తూ “నన్ను నమ్మొచ్చనుకుంటా.”

***

మళ్ళీ సుధీర్ సౌమ్యను వెంబడించసాగాడు.  అది గమనించిన సౌమ్యకు చిర్రెత్తుకొచ్చింది.  ఆటోకి అడ్డంగా స్కూటీని ఆపేసింది.

“చిన్నా దామ్మా లిఫ్టిస్తా దా”

ఆటో డ్రైవర్, సుధీర్ నోళ్ళెళ్ళబెట్టారు.  సుధీర్ వచ్చి స్కూటీ ఎక్కాడు.

“ఎక్కడికెళ్దాం?”

“మీ…మీ ఇష్టం.”

ఇద్దరూ ఓ రెస్టారెంట్లోకి వెళ్ళారు.

కాఫీ ఆర్డరిచ్చి “కహానీ మొదలుపెట్టు” అంది సౌమ్య.

***

KK cellphone ring అయింది.  ఎంతో ఆసక్తిగా వింటున్నాడు.

***

సౌమ్య కాఫీ తాగడం పూర్తి చేసింది.  “ఐదు సంవత్సరాలుగా నువ్వెక్కడున్నావో ఏం చేశావో గుర్తులేదు.  నా స్కూటీ నంబరు నీ దగ్గరకు ఎలా వచ్చిందో తెలియదు.  ఊ…స్టోరీ బాగానే ఉంది.  కానీ ఇందులో లవ్ ఫీలింగ్ ఏదీ?”

“అది కాదండి…మీరే ఎలాగైనా  help చెయ్యాలి.”

“కరక్టే !  కథలో ఆ ఫీల్ లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు.”

సుధీర్ తల పట్టుకున్నాడు.

“ఇప్పుడు ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం.  నీకు మా ఇల్లు తెలుసు.  నా ఆఫీసు తెలుసు.  నా ఫోన్ నంబరు కూడా ఇస్తాను.  నేనేం నువ్వంటే ఇష్టం లేదని చెప్పట్లేదుగా.  try చెయ్.  మంచి స్టోరీ తో వస్తే నేను మాత్రం కాదంటానా !  వెళ్ళనా నాకు ఆఫీస్ కు టైం అవుతుంది.”

***

VISWANATH’S OFFICE

KK హడావుడిగా లోనికొచ్చాడు.  సోఫీ ఫోటో తీసి విశ్వనాథ్ కిచ్చాడు.  “సోఫీ…ఖంజర్ girlfriend.  Hyderabad కు బయలుదేరిందని information.”

ఇద్దరూ కలిసి పక్క రూం లోకి వెళ్ళారు.

శశి Shamshabad Airport cc camera recordings చెక్ చేస్తున్నాడు.  బయటకు వస్తున్న సొఫీ కనిపించగానే freeze చేశాడు.  “Information correct sir, Sophie Hyderabad వచ్చేసింది.”

***

రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన సుధీర్ పైకి అకస్మాత్తుగా పాండు మనుషులు వచ్చి పడ్డారు.  కొంత ఘర్షణ జరిగాక సుధీర్ ను బలవంతంగా జీపులోకి ఎక్కించబోతుండగా బైక్ పై కాల్పులు జరుపుతూ సోఫీ వచ్చేసింది.  తెలివిగా జీపు టైర్లను పేల్చేయడంతో సుధీర్ ని వదిలేసి పారిపోయారు.  ఓక్క క్షణం సుధీర్ ను తన్మయత్వంగా చూసి “ఖంజర్” అంటూ కౌగలించుకుంది.

***

HOTEL ROOM

“ఏమై పోయావ్?  హైదరాబాద్ వచ్చిన దగ్గరనుంచి ఒక్క ఫోన్ లేదు.  మెసేజ్ లేదు.  అసలు నువ్వెక్కడున్నావోకూడా మాకు తెలియలేదు.  భాయ్ కైతే heart attack వచ్చేసింది.  ఏం మాట్లాడవేం” అడిగింది సోఫీ.

సుధీర్ కు ఇంకా తానే ఖంజర్ అంటే నమ్మబుద్ధికావడంలేదు.  “అది…అది..”

“సర్లే మనం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు.  ముందు నువ్వు సేఫ్ గా ఉన్నావని భాయ్ కి చెప్పాలి.  బాగా tired గా  ఉన్నావు.  Rest తీసుకో.”

***

VISWANATH’S OFFICE

విశ్వనాథ్  KK ఏదో discuss చేసుకుంటుంటే శశి వచ్చాడు.

“సోఫీ గురించి ఏదైనా ఆచూకీ దొరికిందా?” అడిగాడు విశ్వనాథ్.

“లేదు సర్.  కాని నాకో ఐడియా వచ్చింది.”

“ఏంటది?”

“Airport cc cameras…గతంలో ఖంజర్ హత్యలు చేసిన ఏరియాల్లో చెక్ చేస్తే…”

“చేస్తే”

“ఖంజర్ సోఫీని కూడా తీసుకొని వెళ్ళుంటే…”

“వెళ్ళుంటే”

“సోఫీని మనం గుర్తు పడతాం కనుక…”

“Yes.  Very good idea.  Let’s do it.”

***

BEDROOM

సౌమ్య సుధీర్ ను తలచుకుని నవ్వుకుంటోంది.  రోజూ అతను తన వెంటపడటం, తను విసుక్కోవడం, ఏడిపించడం, బెదిరించి అతనితో షాపింగ్ చేయించుకోవడం అన్నీ గుర్తొచ్చి నవ్వుకుంటోంది.  సెల్ ఫోన్ తీసి అతని ఫోటోను తదేకంగా చూస్తోంది.

***

HOTEL ROOM

సుధీర్ నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతున్నాడు.  బాల్కనీ లోకి రాగానే రోడ్డుమీద  alternate gajini కనిపించాడు.  వెంటనే అతని మాటలు గుర్తొచ్చాయి.

“నిజమే మెమరీ లేకపోతే ఎవడేం చెప్పినా నమ్మాలి.”

పర్సు లోని పాత నోట్లు తీసి చూశాడు.  సౌమ్య స్కూటీ నంబరు ఏదో చెప్తోంది.  ఇక ఆలస్యం చెయ్యదలుచుకోలేదు.

***

BEDROOM

సుధీర్ ఆలోచనల్లో ఉన్న సౌమ్య డోర్ బెల్ మోగడంతో బయటకు వచ్చింది.  ఎదురుగా సుధీర్.

“ఏంటి ఇప్పుడొచ్చావ్?”

“స్కూటీ కీస్”

“ఎందుకు?”

“చెప్పింది చెయ్” గర్జించాడు.

“OK…OK” తెచ్చిచ్చింది.

స్కూటీ అణూవణువూ వెతికాడు.  సీటు కింది భాగంలో ప్లాస్టిక్ కవరొకటి అతికించబడి ఉంది.  విప్పి చూశాడు.  ఓ ఉత్తరం.

***

VISWANATH’S OFFICE

KK విశ్వనాథ్ లోనికొస్తున్నారు.

“ఖంజర్ మర్డర్స్ చేసిన ఏరియాల్లోని cc camera recordings అన్నీ చెక్ చేస్తున్నాం సర్.  శశి అర్జంటుగా రమ్మన్నాడంటే I think we have good news.” అన్నాడు KK.

ఇద్దరూ లోనికి వెళ్ళారు.  శశితో పాటు లోపల ఓ పది మంది పని చేస్తున్నారు.

శశి:  “మర్డర్స్ జరిగిన ప్రతి ఏరియాకి వారం నుంచి పది రోజుల ముందు సోఫీ వెళ్ళింది సర్.  అన్ని చోట్లా సోఫీ తో పాటు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు.”

అన్ని స్క్రీన్ ల పైనా సోఫీ సుధీర్ లున్నారు.

“Yes.  He is Khanjar.  Very good job శశి.  Thank you very much for your help.”  KK ని ఆలింగనం చేసుకున్నాడు విశ్వనాథ్.

అంతా చప్పట్లతో తమ సంతోషాన్ని తెలిపారు.

***

సుధీర్ ఉత్తరం చదవసాగాడు.

“నువ్వీ ఉత్తరం చదువుతున్నావంటే గత ఐదు సంవత్సరాల మెమరీని నువ్వు కోల్పోయి ఉంటావు.  ఈ చేతిరాతను గుర్తుపట్టావా?  నీదే.  ఇది నీకు నువ్వు రాసుకున్న ఉత్తరం.

కావాలనే నీ మెమరీని నువ్వే పోగొట్టుకున్నావు.  ఎందుకు అని ఆలోచించకు.  భరించలేని బాధని మర్చిపోవడానికి నీకు నువ్వే చేసుకున్న ఏర్పాటది.  మరలా దాన్ని గుర్తు తెచ్చుకోకు.

అయితే ఇందుకోసం గన్స్ సప్లై చేసే వ్యక్తులతో నువ్వో ఒప్పందం కుదుర్చుకున్నావు.  ఓ సంవత్సరం పాటు వాళ్ళు చెప్పిన చోటుకెళ్ళి వాళ్ళు చెప్పిన వ్యక్తులకు రహస్యంగా గన్స్ అందచేయాలి.  బయటి వ్యక్తులు ఎవరితోనూ నువ్వు కలవకూడదు.  నీకు సంబంధించిన అన్ని వివరాలు వాళ్ళకి చెప్పాలి.  అనుక్షణం నీ మీద నిఘా ఉంటుంది.  నీతో పాటు ప్రతి చోటికీ సోఫీ వస్తుంది.  అంతా ఆమె ప్లాన్ ప్రకారమే జరుగుతుంది.

వాళ్ళు పెట్టిన సంవత్సరం గడువు కొన్నాళ్ళలో తీరబోతోంది.  త్వరలో నీ మెమరీ పోగొడతారు.  ఏ స్వార్థమూ లేకుండా ఎవరూ సహాయం చేయరు.  ఎంత ఆలోచించినా నీ వల్ల వాళ్ళకొచ్చే ఉపయోగమేంటో అర్థం కావడం లేదు.  కాని ఏదో ఉంది.

ఓ మెకానిక్ షెడ్లో ఈ స్కూటీ ని చూశాక ఈ ఉత్తరం ఐడియా వచ్చింది.  నీ అదృష్టం బాగుంది కనుక నీ పర్సులోని పాత నోట్లని వాళ్ళు పట్టించుకోలేదు.

నీ చుట్టూ ఏదో ఉచ్చు బిగుస్తోంది.  జాగ్రత్త !!!”

***INTERMISSION***

P. VENKATA RAO (9849421716)

సౌమ్య ఇల్లు:

“ఏంటి నువ్వనేది?”

“నన్ను ఖంజర్ గా సెటప్ చేశారు.  కేవలం గన్స్ స్మగుల్ చేయడానికి వాళ్ళు నాకు సహాయం చెయ్యాల్సిన అవసరంలేదు.  ఆ పని ఎవడైనా చేస్తాడు.  కాని నేనే ఖంజర్ అని ఆధారాలు సృష్టిస్తే నాకు మెమరీ ఉండదు కనుక అదే నిజమని నేనూ నమ్ముతాను.  కరక్ట్…మెమరీ లేకపోతే ఎవడేం చెప్పినా నమ్మాలి.”

“పోలీసులకి అంతా చెప్పేస్తే?”

“ఈ పాటికి వాళ్ళు నేనే ఖంజర్ నని ఫిక్స్ అయిపోయి ఉంటారు.  నమ్మరు..”

“మరిప్పుడెలా?”

“అదే ఆలోచిస్తున్నాను.  పోలీసుల దగ్గరకి వెళ్ళలేను.  వీళ్ళనుంచి పారిపోనూలేను.  వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే నేను సోఫీ దగ్గరికి వెళ్ళక తప్పదు.  సౌమ్యా ! నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు.  నాకో హెల్ప్ చెయ్యగలవా?”

“ఏంటి?”

“ఖంజర్ కేసు ఎవరు డీల్ చేస్తున్నారో ఆ డిటైల్స్ ఎలాగైనా సంపాదించగలవా?”

“తప్పకుండా”

***

HOTEL ROOM

పొద్దున్నే కాఫీ తాగుతూ సోఫీ వచ్చింది.

“భాయ్ తో మాట్లాడాలి”

“అది…అది…”

“ఫర్వాలేదు.  ఫోన్ కలుపు.”

“హా భాయ్…నేనే మాట్లాడుతున్నా…ఇక్కడ నాకు యాక్సిడెంట్ అయ్యింది.  సోఫీ వచ్చి చెప్పేదాకా నాకేమీ గుర్తులేదు.  Now I am OK.  నో భాయ్.  వచ్చిన పని పూర్తి చేసే వస్తాను.  OK భాయ్ ఉంటా.”

***

MUMBAI

ఖంజర్ telescopic gun తో ప్రాక్టీస్ చేస్తున్నాడు.  సంతోషంగా తన దగ్గరకొస్తున్న భాయ్ ని చూసి ఎదురెళ్ళాడు.

“Yes.  నా ప్లాన్ success రా తమ్ముడూ.  వాడు తనే ఖంజర్ నని నమ్ముతున్నాడు.  హైదరాబాద్ అసైన్ మెంట్ కూడా చేస్తాడంట.”  నవ్వాపుకోలేకపోయాడు భాయ్.  “నువ్వు…నువ్వు… ఇంక హైదరాబాద్ బయలుదేరు.”

“ఎవడన్నయ్య వాడు? ఎలా పట్టావు వాణ్ణి?”

***

BATCHELORS’ ROOM

కాశి స్నానం చేసి వచ్చి పూజ చేసుకుంటున్నాడు.

శేఖర్ అప్పుడే జాగింగ్ పూర్తి చేసి వచ్చాడు.  రాగానే సెల్ లో సొల్లు మొదలుపెట్టాడు.

“ఏరా తెల్లారిందా సెల్లుకి.  ఇంత పొద్దున్నే ఎవర్రా?”

“జాగింగ్ లో కలిసింది.  Very hot.”

“అయినా నాకు తెలియక అడుగుతాను.  పది నిముషాల క్రితం పరిచయం అయిన వాళ్ళతో అలా గంటలు గంటలు ఏం మాట్లాడతార్రా?”

“మా యిద్దరి గురించి తప్ప ప్రపంచంలో దేని గురించైనా.  ఎందుకంటే మా గురించి ఒకళ్ళకొకళ్ళం చెప్పుకునేవన్నీ అబధ్ధాలే కనుక.”

“ఇది ఇంతకు ముందు నువ్వు మాట్లాడే అమ్మాయిని మోసం చెయ్యడమే కదరా !”

నీళ్ళు తాగుతున్న శేఖర్ కి పొలమారింది.

“ఒరే ఎర్రబస్సు.  వాళ్ళు నా girlfriends రా పెళ్ళికూతుళ్ళు కాదు. పరిచయమయిన ప్రతి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలంటే నేనో పేద్ద  apartment కట్టాలి.  ఇక్కడంత సీన్ లేదు.  ఆల్రెడీ ఓ పవిత్ర ప్రేమికుడున్నాడు కదరా రూములో.  నన్నొదల్రా బాబూ.”

సెల్ ఫోన్ రింగయింది.  నిద్రలేచిన సుధీర్ తీసుకుని చూశాడు.  నవీన ఫోటో.  ముద్దాడి సొల్లు మొదలు పెట్టాడు.

“వాడు వదిలాడనుకుంటే వీడు మొదలు పెట్టాడు.  శివ శివా…ఈ సెల్ ఫోన్స్ ని బ్యాన్ చెయ్యాలి.”

***

ముగ్గురూ బయటికెళ్ళడానికి రడీ అవుతున్నారు.  కాశీ త్వరగా రడీ అయి కూర్చుంటే, శేఖర్ సుధీర్ లు సెల్ ఫోన్ మాట్లాడుతూ మధ్యలో వీలు దొరికినప్పుడు బ్రష్ చేసుకుంటూ స్నానాలు చేస్తూ రడీ అవుతున్నారు.  కాశీకు చిర్రెత్తుకొస్తోంది.

“ఒరేయ్ సుధీర్ ! రాత్రి రెండు గంటలదాకా మాట్లాడుకున్నారు కదరా మళ్ళీ పొద్దున్నే ఏంట్రా ఈ రాక్షస ప్రేమ.”

***

ముగ్గురూ బయటికొచ్చారు.

“నన్నెవరు డ్రాప్ చేస్తార్రా?”

“సారీ.  నేను నవీనని పికప్ చేసుకోవాలి.”

“సారీ.  నేను నా జాగింగ్ ఫ్రెండ్ దగ్గరికెళ్ళాలి.”

“మరి నా పరిస్థితేంట్రా?”

“బస్సులో ఫో.  నీ కలవాటే కదరా ఎర్రబస్సు.”

***

సాయంత్రం అయింది.  ముగ్గురూ తిరిగి రూముకొచ్చారు.  కాశి అలసిపోయి పడుకున్నాడు.  వచ్చీ రావడంతోనే శేఖర్ సుధీర్ లిద్దరూ సెల్ ఫోన్ తీసుకొని చెరో మూలకెళ్ళి సొల్లు మొదలుపెట్టారు.  అటూ ఇటూ చూసిన కాశీకి చిర్రెత్తుకొచ్చి TV on చేశాడు.  ఇద్దరూ సౌండ్ తగ్గించమన్నట్లుగా సైగలు చేశారు.  ఎక్కడో కాలి ఇంకా వాల్యూం పెంచాడు కాశి.  దాంతో ఒకడు డాబా మీదకెళితే ఇంకొకడు రోడ్డు మీదకు చచ్చాడు.  కాని సెల్ మాత్రం వదల్లేదు.

TV లో ఒక్క పైసాతో ఒక గంట మాట్లాడుకోండి అని యాడ్ వస్తోంది.  TV remote ను కసిగా నేలకేసి కొట్టాడు కాశి.

కొంతసేపటికి ఇద్దరూ తిరిగి వచ్చారు.

“ఒరే ! ఇవాళ డ్యూటీ ఎవరిదో తొందరగా వండి నా ముఖాన ఓ ముద్ద పడేయండిరా.  ఆకలవుతుంది.”  వేడుకున్నాడు కాశి.

ఇంతలో శేఖర్ సెల్ రింగ్ అయింది.  “Hey !  darling…after a longtime…” అంటూ బయటికెళ్ళాడు.

సుధీర్ కేసి చూశాడు.  అతని సెల్ రింగయింది.  “ఇంకా కర్రీస్ ఏమీ అనుకోలేదు.  మీ ఇంట్లో ఏం కూర?”

“మళ్ళీ మొదలు.  వీళ్ళని నమ్ముకుంటే నాకు ఆకలి చావే”  లేచి వంట చెయ్యడానికి రడీ అయ్యాడు కాశి.

కాశి కూరగాయలు తరగడం దగ్గరనుంచి, బాండీ పొయ్యిమీద పెట్టడం, పోపు వెయ్యడం, ఉల్లిపాయలు వెయ్యడం అంతా ఫోన్ లో రన్నింగ్ కామెంటరీ లాగా చెప్తున్నాడు సుధీర్.

“ఒరే ! ఎందుకురా నోరు నొప్పి?  MMS పంపించరా నా బతుకెలాగ ఏడిసిందో చూస్తుంది.  వీళ్ళమ్మల కడుపులు మాడ !  నంజుకు తింటున్నారు కొడుకులు.”

తింటున్నంతసేపూ ఓ చేత్తో భోం చేస్తూ రెండో చేత్తో సెల్ ఫోన్లో మెసేజ్ లు టైప్ చేస్తున్నారు శేఖర్ సుధీర్.  అన్నం కూర ఏది కావాలన్నా సైగలతోనే తమ పళ్ళెంలో వెయ్యమని కాశీకి చెప్తున్నారు.

భోజనాలయి పడుకున్నాక కాశీకి ఏవో శబ్దాలు వినిపించి మెలకువ వచ్చి చూశాడు.  చెరోమూల దుప్పటి ముసుగేసుకుని కొరివి దయ్యాల్లా సెల్ లో మాట్లాడుతున్నారిద్దరూ.  తన ఖర్మకు తనను తాను తిట్టుకుంటూ ముసుగు కప్పుకున్నాడు కాశి.

***

సుధీర్ బట్టలు సర్దుకుంటున్నాడు.

“ఎక్కడికిరా?”  అడిగాడు కాశి.

“మా బామ్మకు సీరియస్ గా ఉందంటరా.  నవీనని చూడాలని చాలా సార్లు అడిగింది.  తీసికెళ్ళడం కుదరలేదు.  మా బామ్మ కేమైనా అయితే నాకెవరున్నార్రా?”

“ఏం కాదులేరా.  నువ్వు త్వరగా బయల్దేరు.”

***

సుధీర్ వెళ్ళేసరికి బామ్మ చనిపోయింది.  ఆమె మీద పడి కన్నీరు మున్నీరుగా విలపించాడు సుధీర్.

కొన్నాళ్ళకు తిరిగి హైదరాబాద్ బయలుదేరాడు.

సుధీర్ రూములోకి వచ్చాడు.

“వారం రోజులనుంచి try చేస్తున్నాను.  నవీన సెల్  switch off లో ఉంది.  ఏమైందో తెలియడం లేదు.  నేనోసారి నవీన దగ్గరకు వెళ్ళొస్తారా.”

“ఇప్పుడొద్దులేరా”

“ఏం?”

“అది…అది…తను సెల్ నంబరు మార్చిందంటరా”

“ఆ విషయం నాతో చెప్పాలి కాని మీకు చెప్పడమేంట్రా?”

“రేయ్ ! light తీసుకోరా”

“విసిగించకుండా ఏమైందో చెప్పండ్రా”

శేఖర్ ఓ శుభలేఖ తెచ్చి సుధీర్ చేతిలో పెట్టాడు.  “నవీనకు పెళ్ళి కుదిరిందిరా”

సుధీర్ కుప్పకూలిపోయాడు.  మెదడు మొద్దుబారిపోయింది.  “ఏం…ఏం..” మాటలు కూడా సరిగ్గా రావడం లేదు.  బామ్మ కోసం ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్ళు కూడా ఇంకి పోయాయి.  దెబ్బ మీద దెబ్బ.  కొన్ని క్షణాలు అలానే కూర్చుండిపోయిన తర్వాత లేచాడు.

“ఎక్కడికిరా?”

“నవీన దగ్గరికి”

“నీకేమైనా పిచ్చా?  నీతో కాంటాక్ట్స్ ఉండకూడదనే కదరా సెల్ నంబర్ మార్చింది.  శుభలేఖ మాకిచ్చి వెళ్ళింది.  వెళ్ళి ఏం మాట్లాడతావురా?”

“తనకు బలవంతంగా పెళ్ళి చేస్తున్నారేమోరా?”

“అది నీ అమాయకత్వం రా.  వాళ్ళ చుట్టాలెవరో అమెరికాలో సెటిలయి బాగా సంపాదించారు.  నువ్వు ఊరెళ్ళగానే వాళ్ళు ఇండియా వచ్చి నవీనని చూసుకున్నారు.  కాబోయే భర్తతో కలసివచ్చి అందరు friends కి ఇచ్చినట్లుగానే మన ముగ్గురికీ శుభలెఖ ఇచ్చి వెళ్ళింది.  తననెవరూ బలవంత పెట్టలేదు.”

“నేను నమ్మను.  తనతో ఒకసారి మాట్లాడి వస్తాను.”

***

“చాలా మంచి సంబంధం.  అమ్మా నాన్నకు కూడా బాగా నచ్చారు.  నువ్వు బాధ పడతావని తెలుసు.  అందుకే నీకు చెప్పలేదు.  సారీ.”

“మా బామ్మ కూడా లేదు.  నువ్వు తప్ప నాకింకెవ్వరూ లేరు నవీనా !”  మాటలు గొంతులోనే ఉండిపోయాయి.

ఆమె మొహంలో గిల్టీ ఫీలింగ్ స్పష్టంగా కనబడుతోంది.

“నేను వెళ్తాను.  పెళ్ళి పనులు చాలా ఉన్నాయి.”

సుధీర్ శిలలా నిలబడిపోయాడు.

***

ఎప్పుడూ సందడిగా ఉండే రూము సైలెంట్ గా ఉంది.  సుధీర్ నిస్తేజంగా పడుకొని ఉన్నాడు.

“నవీన ఇలా చేస్తుందనుకోలేదురా !  పాపం రా…నాలుగేళ్ళుగా తను తప్ప వేరే ప్రపంచమే తెలీదు వీడికి.  నవీనకి దూరంగా వెళ్ళాల్సొస్తుందని మంచి జాబ్స్ కూడా వదులుకున్నాడు కదరా.  ఇలాంటివాణ్ణి ఎలా మోసం చేయ బుధ్ధైందిరా తనకి?”  వాపోయాడు కాశి.

“డబ్బురా !  అది ఎంత పనైనా చేయిస్తుంది.”

“కనీసం వాడికో మాట చెప్పి…”

“ఏమని చెప్తుందిరా?  నీ గుండెల్లో పొడవబోతున్నాను.  నొప్పిగా ఉంటుంది.  ఓర్చుకో అనా…వదిలెయ్ రా…ఇంతకీ వీడేమైనా తిన్నాడా?”

“తిండి మాట దేవుడెరుగు.  నాలుగు రోజులుగా వాడు నిద్ర కూడా పోవడం లేదురా.  నిద్రలో ఉలిక్కి పడి లేచి కూర్చుంటున్నాడు.  కలలో కూడా తనే కనిపిస్తుందేమోరా !”

“వాడినలా ఒంటరిగా వదిలేయకుండా వాడితో ఏదైనా మాట్లాడుతూ ఉండరా.”

“ఆ ధైర్యం నాకు లేదురా !  వాడికన్నా ముందు నేనే ఏడ్చేస్తాను.”

“సరే పద బయటికెళ్ళొద్దాం.”

***

ఇద్దరూ తిరిగివచ్చి మందు సెటప్ చేశారు.

“రేయ్ సుధీర్ లేవరా. బాధలొచ్చినప్పుడు మర్చిపోవడానికి ట్రై చెయ్యాలిరా.  అదే తలుచుకుంటూ బాధ పడితే ఎలారా?  రెండు పెగ్గులేస్తే అన్నీ మర్చిపోవచ్చు లే లే..” అన్నాడు శేఖర్.

“ఎన్ని బాటిల్స్ తాగితే తనను మర్చిపోవచ్చో చెప్పరా.  అన్నీ ఒకేసారి తాగేస్తాను.  మా బామ్మని ఆ దేవుడు తీసికెళ్ళాడు కనుక ఏమీ చెయ్యలేక ఏడ్చి ఊరుకున్నాను.  కాని నవీన ఇక్కడే ఉందిరా.  ఒక్కసారిగా గుండెను కోసేసి ఏమీ కాలేదు మామూలుగా బ్రతుకు అంటే ఎలారా?” ఇద్దరినీ కావలించుకుని ఏడవసాగాడు.

“పోనీ ఒక్కసారి తననిక్కడికి తీసుకురానా?”  అడిగాడు కాశి.

“తనని నేనెంతగా ప్రేమించానో తనకి తెలుసురా.  తెలిసి కావాలని చేసేవాళ్ళకి ఏమని చెప్తాం?  అయినా తనింక రాదు.  తన కళ్ళలోనే తెలిసిపోతోంది.  నా ఖర్మ కి మీరేం చేస్తార్రా.  మీరు తాగండి.”

***

రోజులు గడుస్తున్నాయి.  సుధీర్ తిండీతిప్పలు మానేసి శవంలా పడుంటున్నాడు.  అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చిన వాడిలా తను నవీన గడిపిన ప్రాంతాలకెళ్ళి కూర్చుంటున్నాడు.  పార్క్ బెంచీలు, తను తొలిసారిగా నవీన ను చూసిన లిఫ్టు, సినిమాలు చూసిన థియేటర్స్, షాపింగ్ మాల్స్…యిలా అన్నీ చూసుకురావడం, అలాగే పడుకోవడం.  దాదాపు పిచ్చివాడిలా తయారయ్యాడు.  కాశి శేఖర్లకు బదులివ్వడం కూడా మానేశాడు.

“వీడి పరిస్థితి ఏంట్రా? వీణ్ణేం చేద్దాం?”

“అదే నాకూ అర్థం కావట్లేదురా.  వీళ్ళ బంధువుల్లో కూడా అంతగా పట్టించుకునేవాళ్ళు లేరు.  మనం ఇవాళ కాకపోతే రేపు పొట్ట చేతబట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతాం.”

ఇంతలో నీళ్ళు తాగుదామని కుండ దగ్గరికి వెళ్ళాడు సుధీర్.  నీరసంతో చేతిలోని గ్లాసు జారి తూలి గోడను గుద్దుకున్నాడు.  తలలోచి రక్తం కారసాగింది.

సుధీర్ ని తీసుకొచ్చి బెడ్ మీద కూలేశారు.

“ఏంట్రా?  ఎవరిని సాధిద్దామనిరా ఈ పిచ్చిపనులు.  చస్తే ఒకసారి ఏడ్చి ఊరుకుంటాం.  ఇట్లా రోజూ చంపకురా మమ్మల్ని.”

“నేను చావను”  పెద్దగా అరిచాడు.  “ఎవరో మోసం చేస్తే నేనెందుకు చావాలి?  నేనంత పిరికివాణ్ణి కాదు.  నేను చావను… చావను… చావను… చావను…”  హిస్టీరిక్ గా అరవడం మొదలుపెట్టాడు.

“మరేం కావాల్రా నీకు?”

“నా మెదడును పగలగొట్టి అందులోచి తన జ్ఞాపకాలన్నీ తుడిచేయ్.  తన పేరు, తన ముఖం…ఏదీ… ఏదీ నాకు గుర్తుండకూడదు.  చేస్తావా?  ఆ…చేస్తావా?   చెయ్.  తలపగలగొట్టుకోనా…కోనా..”

సుధీర్ ను కంట్రోల్ చెయ్యడం వాళ్ళిద్దరివల్లా కావడం లేదు.

***

“నాకు కొంచెం డబ్బు కావాల్రా.  తరవాతిస్తాను.”  కాశీని అడిగాడు సుధీర్.

“దేనికిరా?”

“ఇవాళ నవీన పెళ్ళి.  గిఫ్టు కొనాలి.”

“ఒకసారి అద్దంలో చూసుకోరా ఎలా ఉన్నావో !  ఇలానే వెళ్తావా పెళ్ళికి?”

“నేను లోపలికి రాన్లే.  దూరం నుంచి చూసి వచ్చేస్తాను.  మీరు పెళ్ళికి వెళ్ళిరండి.  వచ్చి కార్డు ఇచ్చి వెళ్ళింది కదరా !”

***

శేఖర్ కాశి లోపలికెళ్ళిపోతే కళ్యాణమంటపం బయటే ఆగిపోయాడు సుధీర్.  టీవీ లో పెళ్ళితంతు అంతా చూస్తూ కన్నీరు పెడుతున్నాడు.  తాళి కట్టే సమయానికి అతని ఆక్రోశం తారా స్థాయికి చేరింది.  ఇక చూడలేక పిచ్చిగా అరుస్తూ రోడ్డు మీదకు పరుగుతీశాడు.

***

“ఏడ్ర్రా వీడు?”  రూము లోనికొస్తూ అడిగాడు శేఖర్.

“ఏమోరా.  మనం మాత్రం ఎంతకాలం కాపలా కాస్తాం?  ఎవరన్నా psychiatrist కి చూపిద్దాంరా.”

“సర్లే ముందు వీడెక్కడున్నాడో వెతుకుదాం పద.”

“అవసరం లేదు.  ఇవాళ నవీన USA కి వెళ్ళిపోతోంది.  Airport కి  వెళ్ళుంటాడు.”

***

నవీన ఇంటి దగ్గర నుండి Airport దాకా ఆమెనే చూస్తూ వెంబడిస్తున్నాడు సుధీర్.  ఇక తను జీవితంలో మళ్ళా ఆమెను చూడలేడు అన్న ఊహ అతణ్ణి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.  కన్నీళ్ళలోంచి ఆమె రూపం మసక మసకగా కనబడుతోంది.

Airport లో wait చేస్తున్నంతసేపూ ఆమెనే చూస్తూ దూరంగా నిలుచున్నాడు సుధీర్.  Flight time అయింది.  ఆమె లేచి లోనికి వెళ్ళిపోయింది.  సుధీర్ చకచకా బయటికి వచ్చేశాడు.  విమానం take off అయింది.  దాన్నే చూస్తూ “నవీనా…” అని అరుస్తూ వెనక్కు పడిపోయాడు సుధీర్.

***

PSYCHIATRY HOSPITAL

Dr. Chandra రూములోకి భాయ్ వచ్చాడు.  “Hello doctor”

“Hello ఏంటిలా సడెన్ గా”

“చిన్న పని మీద హైదరాబాద్ వచ్చాను.  మిమ్మల్ని ఒకసారి పలకరించి వెళ్దామని”

“డాక్టర్…డాక్టర్…సుధీర్…” నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చింది.

“Oh !  No.  Excuse me”  డాక్టర్ నర్స్ బయటికెళ్ళారు.  ఏవో అరుపులు వినబడటంతో చూద్దామని భాయ్ కూడా వెళ్ళాడు.

సుధీర్ ని బెడ్ పై కట్టేసి కంట్రోల్ చెయ్యడానికి నలుగురు స్టాఫ్ నానా తంటాలు పడుతున్నారు.  డాక్టరు ఇంజెక్షన్ రడీ చేస్తున్నాడు.

“ఈ ఇంజెక్షన్లు కరంట్ షాక్ లు నా బాధను తగ్గిచలేవు.  నేను పిచ్చివాణ్ణి కాదు డాక్టర్.  Please doctor… help me … తనని నా మైండ్ లోచి తీసేయండి…. తీసేయండి…. “  చెవులు చిల్లులుపడేలా అరుస్తున్నాడు సుధీర్.

మత్తు ఇంజక్షన్ ఇచ్చి తన రూములోకి వచ్చి కూర్చున్నాడు డాక్టర్.

“ఏంటి కేసు?”  అడిగాడు భాయ్.

“Love failure.  తను ప్రేమించిన అమ్మాయి వేరే అతన్ని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది.”

“Love failure ఇంత దారుణంగా ఉంటుందా?”

“నరకం అంటే ఎక్కడో లేదు.”

“ఏదో తీసేయండి తీసేయండి అంటున్నాడు.”

“ఆ అమ్మాయికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ.  అతను చెప్పేది కరక్టే.  అతను పిచ్చివాడు కాదు.  కాకపోతే ఆమెను పిచ్చిగా ప్రేమించాడు.  తనను మోసం చేసిందని తెలుస్తున్నా subconscious memory లో ఆమెపై ఉన్న ఇష్టం, ఆమెతో గడిపిన క్షణాలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.  మోసానికి ఇష్టానికి మెదడులో జరిగే యుధ్ధమది.  చాలా భయంకరంగా ఉంటుంది.  అందుకే ఆ మెమరీని తీసేయండి అంటూ అరుస్తున్నాడు.”

“అది సాధ్యమేనా?”

“Maybe.  కాని ఒక్క ఆమె జ్ఞాపకాలని మాత్రమే తుడిచెయ్యడం సాధ్యం కాదు.  ఆమెతో గడిపిన ఈ నాలుగు సంవత్సరాలనూ తీసెయ్యాలి.  Clinical hypnosis ద్వారా ఆమె పరిచయం కాక ముందురోజు వరకు అతన్ని తీసికెళ్ళగలిగితే సాధ్యం కావచ్చు.  అయితే దానికి  specialists కావాలి.  Multiple sessions చేయాలి.  చాలా ఖర్చవుతుంది.  ఇతనో అనాథ.  ఇతని బాధ చూడలేక ఇతని roommates ఇక్కడ చేర్పించారు.  కొన్నాళ్ళ తరవాత నేను కూడా  Govt. Hospital కి refer చేద్దామనుకుంటున్నాను.”

“Sure గా చెప్పండి.  ఇతను గతాన్ని మర్చిపోగలడా?”

“Hypnotism లో కూడా failures ఉంటాయి.  ఇతను చెప్పేది నేను నమ్మను అని బలంగా కోరుకుంటే, ఏ హిప్నాటిస్టూ ఏమీ చెయ్యలేడు.  దీనికి మంచి example, criminals lie detector test ను కూడా  beat చెయ్యడం.  కాని ఇక్కడ సుధీర్ సిధ్ధంగా ఉన్నాడు.  Definite గా  success అవుతుంది.

***

భాయ్ ఖంజర్ తో:

“అప్పుడు ఫ్లాష్ లా నాకో ఐడియా వచ్చింది.  నీ కోసం పోలీసుల గాలింపు ఎక్కువైంది.  మెమరీ లేని సుధీర్ ని ఖంజర్ గా నిరూపిస్తే?

సుధీర్ hospital నుండి పారిపోయాడు అని డాక్టర్ చేత చెప్పించాను.  అతని ఫ్రెండ్స్ ఇక పట్టించుకోవడం మానేశారు.  సుధీర్ ని ముంబయి తీసుకువచ్చి అగ్రిమెంట్ కుదిర్చాను.

నువ్వు చేసిన ప్రతి హత్యకు గన్స్ అందించింది సుధీర్.  Murder spots లో అతనున్నట్లుగా  evidence లు తీసుకున్నాం.  ఇతనే ఖంజర్ అని చెప్పడానికి సోఫీ ఎలాగూ ఉండనేఉంది.

Specialists ని పిలిపించాను.  వాళ్ళు చాలా sessions చేశారు.  చివరకు అనుకున్న result వచ్చింది.  సుధీర్ ఇది 2005 వ సంవత్సరం అనే అనుకుంటున్నాడు.  యాక్సిడెంట్ జరిగినట్టుగా సృష్టించి సుధీర్ ని తీసికెళ్ళి హైదరాబాద్ లో పడేశాం.  పోలీసులకు దొరకడానికి ఖంజర్ రడీ.”

“వా ! భాయ్ !  hats off.”

***

“ఖంజర్ ను పట్టుకోవడానికి ఒక టీం ఏర్పాటయ్యింది.  లీడ్ చేస్తున్నది ACP విశ్వనాథ్.”  చెప్పింది సౌమ్య.

“KK అని ఎవరన్నా ఆ టీం లో ఉన్నారా?” అడిగాడు సుధీర్.

“ఏవరు?”

“KK…సోఫీ cellphone చెక్ చేశాను.  ఎక్కువసార్లు KK తోనే మాట్లాడుతోంది.”

సౌమ్య ఓ లిస్ట్ తీసి చెక్ చేసింది.  “Oh my God !  KK అంటే కృష్ణకాంత్ కావచ్చు.”

“ఎవరతను?”

“ఖంజర్ కేసుని ఒక సంవత్సరం నుంచి ఫాలో అవుతున్న special officer.”

“ప్లాన్ బాగానే వేశారు.  ఇక రిస్క్ తీసుకోక తప్పదు.”

***

విశ్వనాథ్ ఇల్లు:

లోనికొచ్చి dress change చేసుకోబోతుండగా ఎవరో వచ్చినట్లనిపించి పక్కకు చూశాడు విశ్వనాథ్.  ఎదురుగా సుధీర్.  అతనెవరో గుర్తుపట్టటానికి ఒక్క క్షణం పట్టింది.  వెంటనే గన్ తీయబోయాడు.  ఈ లోపు సుధీర్ రియాక్టయ్యాడు.  ఇద్దరి మధ్యన జరిగిన పెనుగులాటలో చివరికి గన్ సుధీర్ చేతిలోకి వచ్చింది.

“నన్ను చూడగానే గన్ తీశారంటే నేనే ఖంజర్ నని అనుకుంటున్నారన్నమాట.”

“అనుకోవడమేంటి?  నువ్వే ఖంజర్ వి.  మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి.”

“అయితే నీను చెప్పేది కూడా వినండి ప్లీజ్…నాకో అవకాశం ఇవ్వండి.”

***

BAR

“Sir, ఈ టైం లో మీరు డ్రింక్ చేయడం…” అర్థంకాక అడిగాడు KK.

“ఈ ఖంజర్ కేసులో బాగా disturb అయ్యాను KK.  ఇంతవరకూ ఏ ప్రోగ్రెస్ లేదు అని DGP గారు కోప్పడ్డారు.” చెప్పాడు విశ్వనాథ్.

“Don’t worry sir.  మన టీం అంతా దాని మీదే వర్క్ చేస్తున్నాం.  It is just a matter of a few days.”

బాత్ రూం కెళ్ళొస్తానని చెప్పి KK కి కనిపించకుండా కొద్ది దూరంలో నిలబడ్డాడు విశ్వనాథ్.

సుధీర్ సిగరెట్ నోట్లో పెట్టుకుని KK దగ్గరకొచ్చి “match box please” అన్నాడు.  KK lighter వెలిగించాడు.  ఆ వెలుతురులో సుధీర్ మొహం స్పష్టంగా కనిపించింది.  థాంక్స్ చెప్పి సుధీర్ వెళ్ళిపోయాడు.

వెంటనే సోఫీ కి కాల్ చెశాడు KK  “ఏంటీ వాణ్ణలా వదిలేశావ్?  డైరెక్ట్ గా నా దగ్గరకే వచ్చాడు.  రెండు నిముషాల ముందు వచ్చి ఉంటే ఈ పాటికి…”  విశ్వనాథ్ రావడం చూసి కట్ చేశాడు.

“మీ సెల్ ఒక సారి ఇవ్వండి.”

KK గొంతు తడారిపోయింది.

“నా సెల్ లో balance అయిపోయింది.”

ఏడవలేక నవ్వుతూ ఇచ్చాడు.

తన సెల్ లోని నంబర్ KK సెల్ లో టైప్ చేస్తున్నట్లు నటిస్తూ సోఫీ నంబర్ నోట్ చేసుకున్నాడు విశ్వనాథ్.  తరువాత ఓ డమ్మీ కాల్ చేసి ఫోన్ తిరిగి ఇచ్చేశాడు.  “OK  Mr. KK నన్ను కొంచెం మా ఇంటి దగ్గర డ్ర్రాప్ చేయండి.

“Sure”

***

KK drop చేసి వెళ్ళిపోయాడు.

విశ్వనాథ్ గేటు తీసుకుని లోనికి రాగానే అతని కోసం ఎదురుచూస్తూ కూర్చున్న సౌమ్య కనిపించింది.

***

సౌమ్య ఇల్లు:

సుధీర్ రాగానే సంతోషంగా అతనికి ఎదురెళ్ళింది సౌమ్య.  “Good news.  “నువ్వు ఖంజర్ వి కాదని విశ్వనాథ్ గారు నమ్మారు.”

“ఈ విషయం నీకెలా తెలుసు?”

“నీ ఉత్తరం తీసికెళ్ళి ఆయనకు జరిగిందంతా చెప్పాను.”

సుధీర్ ముఖంలో నవ్వు మాయమైంది.

“ఒకవేళ ఆయన నమ్మకపోతే నాతో పాటు నువ్వూ జైలు కెళ్ళాల్సొచ్చేది.  ఆ సంగతి తెలుసా?”

“తెలుసు”

“తెలిసి కూడా ఎందుకు చేశావు?”

“ఎందుకో నువ్వంటే అంత ఇష్టం ఏర్పడింది.”

ప్రేమతో సౌమ్యను దగ్గరికి తీసుకున్నాడు సుధీర్.

***

ఒక under construction building లోకి telescopic gun తో సుధీర్ మరో ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు.  కొన్ని ఫ్లోర్లు పైకెక్కిన తర్వాత ఒకడు ఆగమన్నట్లు సైగ చేశాడు.  ఎదురుగా open auditorium కనిపిస్తోంది.

International daimond merchant, Viju Shah ఒక charity meeting కు attend అవుతున్నాడు.

గన్ తో పొజిషన్ తీసుకున్నట్టుగా నటిస్తూ గన్ తిప్పి ఒకడి తలపై బలంగా మోదాడు.  రెండోవాడు రియాక్టయ్యేలోపు అతన్ని మట్టికరిపించాడు.  వాళ్ళలో ఒకడి సెల్ తీసి “హలో విశ్వనాథ్ సర్” అన్నాడు సుధీర్.

***

“ఖంజర్ టార్గెట్ తెలిసిపోయింది సర్”  పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు KK.

“నాక్కూడా”  విశ్వనాథ్ నవ్వులోని ఆంతర్యం అర్థం కాలేదు KK కు.  ఇంతలో బిలబిలమంటూ ఓ ఇరవై మంది పోలీసులు వచ్చి KK, శశితో సహా టీం అందర్నీ అదుపులోకి తీసుకున్నారు.

***

కాలింగ్ బెల్ మోగగానే డోర్ తీసిన సోఫీకి ఎదురుగా గన్ తో ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ కనబడింది.  నలుగురు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి ఆమెను చుట్టుముట్టారు.

***

విశ్వనాథ్ పోలీసులతో వచ్చి ఆ బిల్డింగ్ ను చుట్టుముట్టాడు.

సుధీర్ ఒక్కో బ్లాక్ లో చెక్ చేస్తూ బిల్డింగ్ అంతా వెతుకుతున్నాడు.

గన్ సెట్ చేసుకుంటున్న ఖంజర్ ఏదో అలికిడి అయినట్లనిపించి తలతిప్పి చూశాడు.  ఎదురుగా సుధీర్.

“ఒక్క పనికి ఇద్దరు ఖంజర్ లెందుకు భయ్యా?”

గన్ వదిలేసి సుధీర్ ని  attack చేశాడు ఖంజర్.  ఇద్దరి మధ్య భీకర పోరు సాగుతోంది.

విశ్వనాథ్ వచ్చేసరికి ఖంజర్ ను లొంగదీసుకున్నాడు సుధీర్.

***

AIRPORT

సుధీర్ సౌమ్యలను చూసి వచ్చి పలకరించాడు విశ్వనాథ్ “Hi lovebirds”

“సార్ !  మీరేంటిక్కడ?”

“భాయ్ ని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. మరి అత్తారింటికి తెచ్చుకోవాలిగా…ఉరికంబం ఎక్కవలసిన వాడివి మంచి అమ్మాయిని చేసుకుని సెటిలవ్వబోతున్నావ్.  నీ కష్టాలన్నీ తీరిపోయినయిలే.”

“నా కైతే మొదలయ్యాయనిపిస్తోంది.  కాబోయే మామగారి కోసం ఇప్పటికి గంట నుంచి వెయిటింగ్.”

“మరి తప్పదుగా”

ముగ్గురూ నవ్వుకున్నారు.  విశ్వనాథ్ వెళ్ళిపోయాడు.

అతని వైపే చూస్తున్న సుధీర్ కు ఎదురుగా భార్యతో వస్తున్న ఓ వ్యక్తి డాష్ ఇచ్చాడు.  దంపతుల చేతిలోని లగేజీ జారిపడింది.  ఇద్దరూ పరస్పరం సారీ చెప్పుకున్నారు.  కిందపడ్డ వస్తువులు వారికి అందిస్తోంటే భార్య మాత్రం తదేకంగా సుధీర్ నే చూస్తోంది.  ఆమె నవీన.  సుధీర్ సౌమ్యను వాళ్ళకు పరిచయం చేశాడు.  అతను కూడా నవీన ను సుధీర్ కు పరిచయం చేశాడు.  నవీన చూపు మాత్రం సుధీర్ పై నుండి కదలడం లేదు.  సౌమ్య అది గమనించింది.  బయటకు వెళ్ళేదాకా సుధీర్ ను చూస్తూనే ఉంది నవీన.

“ఏయ్ !  ఎవరో నీకు బాగా క్లోజ్ అనుకుంటా.  గుర్తుతెచ్చుకో.”  ఆటపట్టిస్తోంది సౌమ్య.

“వద్దు.  ఇంకెవ్వరినీ గుర్తుకు తెచ్చుకునే ఓపిక నాకు లేదు.”

వెళ్తూ వెళ్తూ వెనక్కు చూస్తున్న నవీనను అలాగే చూస్తూ ఉండిపోయాడు సుధీర్.

***THE END***


Posted సెప్టెంబరు 23, 2010 by screentalent in Uncategorized

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.